భావనా వికాసం.. అభ్యసనానికి మూలం
అభ్యసనం-3
అభ్యసన బదలాయింపు
''ఒక స్థితిలో జరిగిన అభ్యసనం పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ ఇతర పరిస్థితులకు అనుప్రయుక్తం కావడమే బదలాయింపు.'' - గారెట్అభ్యసనం-3
అభ్యసన బదలాయింపు
బదలాయింపు సిద్ధాంతాలు :
అభ్యసన బదలాయింపునకు సంబంధించిన పరిస్థితులు, అనుకూలతలు, అవరోధాలు మొదలైన వాటిని వివరించేవే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు. అవి:
1. విద్యుక్త క్రమశిక్షణా సిద్ధాంతం
2. సామాన్యీకరణ సిద్ధాంతం
3. సమరూప మూలకాల సిద్ధాంతం
4. ఆదర్శాల సిద్ధాంతం
5. ట్రాన్స్‌పొజిషన్ సిద్ధాంతం
విద్యుక్త క్రమశిక్షణ సిద్ధాంతం:
¤ బదలాయింపు గురించి వివరించిన ప్రాచీన సిద్ధాంతమిది.
¤ మనసులో అనేక విభాగాలుంటాయి. వివేచన, ఆలోచన, జ్ఞాపకం, పరిశీలన మొదలైనవి. ఈ విభాగాలు బలపడేందుకు కొన్ని ప్రత్యేక జ్ఞానాంశాలను అధ్యయనం చేయాలనేది ప్రాచీనుల భావన. అందుకే తర్కశాస్త్రం వల్ల వివేచన, గణితం వల్ల ఏకాగ్రత, సైన్స్ వల్ల 'పరిశీలన' మొదలైన విభాగాలు బలపడతాయని వారు పేర్కొన్నారు. ఈ విభాగాల మధ్య బదలాయింపు జరుగుతుందని ఈ సిద్ధాంతం పేర్కొంటుంది. సప్రమాణత లోపించడం, ఆధునిక సిద్ధాంతాలు హేతుబద్ధంగా ఉండటం వల్ల ఈ సిద్ధాంతాన్ని అంగీకరించడం లేదు.
సామాన్యీకరణ సిద్ధాంతం:
¤ ఛార్లెస్ జడ్ రూపొందించాడు.
¤ ఏ అంశాల మధ్య అయితే సూత్ర సంబంధం ఉంటుందో లేదా ఏర్పడుతుందో అలాంటి అంశాల మధ్య బదలాయింపు జరుగుతుంది.
¤ ఛార్లెస్ జడ్ ప్రయోగంలో పరావర్తన సిద్ధాంతం గురించి జ్ఞానం సంపాదించిన వారు వీటి అడుగు భాగంలో ఉన్న గమ్యాన్ని బాణంతో కచ్చితంగా కొట్టగలిగారు.
¤ మోటారు కారు ఇంజిన్ రిపేర్ తెలిసిన వ్యక్తి మోటార్ బోట్ ఇంజిన్‌ని రిపేర్ చేయడం.
¤ మోటారు కారు ఇంజిన్ రిపేర్ తెలిసిన వ్యక్తి మోటార్ బోట్ ఇంజిన్‌ని రిపేర్ చేయడం.
¤ జడత్వం, గమన నియమాలు తెలిసిన వ్యక్తి.
- బస్సు బ్రేక్ వేయగానే ముందుకు పడకుండా నియంత్రించడం.
- వేగంగా వెళ్తున్న బస్సు నుంచి దిగగానే బస్సు వెళ్లే దిశలోనే ముందుకు పరిగెడుతూ ఆగటం.
- వేగంగా వెళ్లే బస్సు ఎక్కేందుకు బస్సు వెళ్లే దిశలో వేగంగా పరుగెత్తి ఎక్కడం. మొదలైన విషయాల్లో కచ్చితంగా వ్యవహరించగలగడం.
సమరూప మూలకాల సిద్ధాంతం:
దీన్ని థారన్‌డైక్ రూపొందించాడు. ఏయే విషయాల్లో మౌలిక సామ్యం ఉంటుందో, ఆయా విషయాల మధ్యే బదలాయింపు జరుగుతుంది. పద్ధతుల సారూప్యత, వైఖరి సారూప్యత మొదలైన కోణాల్లో కూడా బదలాయింపు జరుగుతుంది.
¤ గణిత నైపుణ్యాలు యాంత్రిక, సాంకేతిక విద్యల బదలాయింపునకు ఉపయోగపడటం.
¤ వ్యాకరణ సూత్రం- మరో వ్యాకరణ సూత్రం.
¤ భాషా సూత్రం- మరో భాషా సూత్రం.
¤ టైప్ రైటర్ కీబోర్డ్- కంప్యూటర్ కీబోర్డ్.
గమనిక :
అనుకూల బదలాయింపులో ప్రస్తావించిన ఉదాహరణలన్నిటిలో దాదాపు ఈ బదలాయింపే ఇమిడి ఉంటుంది. అందువల్ల అనుకూల బదలాయింపు రకాలను ఇక్కడ కూడా అన్వయించుకోవచ్చు.
ఆదర్శాల సిద్ధాంతం:
¤ దీన్ని డబ్ల్యు.సి. బాగ్లే రూపొందించాడు.
¤ ఈ సిద్ధాంతానికి, సామాన్యీకరణ సిద్దాంతానికి ఏకీభవించే అంశాలుంటాయి.
¤ ఒక విషయం, ప్రాధాన్యాన్ని గుర్తించడం వల్ల బద లాయింపు జరుగుతుంది.
¤ వ్యక్తి 'వైఖరులు' ఏర్పడటంలో ఈ తరహా బదలాయింపు దోహదపడుతుంది.
¤ ఇంటిలో పరిశుభ్రత పాటించే వ్యక్తి ఆఫీసులో కూడా శుభ్రతను పాటించడం ఈ తరహా బదలాయింపునకు ఉదాహరణ.
ట్రాన్స్‌పొజిషన్ సిద్దాంతం:
¤ దీన్ని గెస్టాల్ట్ వాదులు రూపొందించారు.
¤ ఒక మొత్తంలోని, విభాగాల మధ్య ఉండే సంబంధాన్ని కొత్త పరిస్థితులకు అన్వయించడం ద్వారా బదలాయింపు జరుగుతుంది.
¤ వివిధ అంశాల మధ్య సంబంధాలు, సమగ్రాకృతి ఈ బదలాయింపులో ప్రధానపాత్ర పోషిస్తాయి.
బదలాయింపు రకాలు :
బదలాయింపు స్థూలంగా నాలుగు రకాలుగా కనిపిస్తుంది.
1. అనుకూల బదలాయింపు :
ఒక విషయంలో నేర్చుకున్న పరిజ్ఞానం మరో విషయం నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది.
ఉదాహరణ :
1. కారు నడపటంలో పొందే శిక్షణ ట్రాక్టర్ నడపటంలో కూడా ఉపయోగపడటం.
2. టైపు రైటర్ కీబోర్డ్ - కంప్యూటర్ కీబోర్డ్
3. హిందీ - సంస్కృతం
4. సైకిల్ - మోటార్‌సైకిల్
5. గణితం - భౌతికశాస్త్రం
6. గణితం - కంప్యూటర్ సైన్స్
7. CUT 'కట్' అని నేర్చుకున్న విద్యార్థి BUT ని 'బట్' అని నేర్చుకోవడం.
8. క్యారమ్స్ - బిలియర్డ్స్
9. షటిల్ - బాల్‌బాడ్మింటన్
10. హాకీ - ఫుట్‌బాల్
11. వీణ - గిటార్
12. పియానో - హార్మోనియం
2. వ్యతిరేక బదలాయింపు :
ఒక విషయంలో నేర్చుకున్న పరిజ్ఞానం మరో విషయం నేర్చుకునేందుకు అవరోధంగా ఉంటే దాన్నే వ్యతిరేక బదలాయింపు అంటారు.
1. తెలుగు వాక్య నిర్మాణం - ఇంగ్లిష్ వాక్య నిర్మాణం
2. CUT 'కట్' అని నేర్చుకున్న విద్యార్థి PUT 'పట్' అని పలకడం.
3. తెలుగు లేదా హిందీ నేర్చుకున్న వాళ్లు ఇంగ్లిష్ నేర్చుకోవడంలోని క్లిష్టత.
4. డ్రైవింగ్ స్థానం కుడివైపు ఉన్న వాహనంలో డ్రైవింగ్ నేర్చుకున్న వ్యక్తి, డ్రైవింగ్ స్థానం ఎడమవైపు ఉన్న వాహనాన్ని నడపలేకపోవడం.
5. ఈ సిద్ధాంతంలో 'భిన్నత్వం' ను పరిగణనలోకి తీసుకోవచ్చు.
3. శూన్య బదలాయింపు:
ఒక విషయంలో నేర్చుకున్న పరిజ్ఞానం మరో విషయం నేర్చుకోవడానికి అవరోధం కాదు, అనుకూలమూ కాదు. అంటే బదలాయింపు ఉండదు. దీన్నే తటస్థ బదలాయింపు అనికూడా అంటారు.
1. ఆటల్లో ప్రతిభ చదువుకు ఉపయోగపడకపోవడం.
2. సైకిల్ తొక్కడం-తెలుగుపద్యాలు.
4. ద్విపార్శ్వ బదలాయింపు:
ఒక చేత్తో నేర్చుకున్న పరిజ్ఞానం మరో చేతికి బదలాయింపు కావడం. దీన్నే కౌశలాల బదలాయింపు అంటారు. ఇది కూడా ఒక రకంగా అనుకూల బదలాయింపే. ఈ తరహా బదలాయింపునకు కారణం మానవ మెదడులోని కార్పస్ కలోజిమ్.
ఉదా:
1. సవ్యసాచి - ఒక చేతితోనే కాకుండా, రెండో చేత్తోనూ బాణాలు వేయగలగడం.
2. రెండు చేతులతో అక్షరాలు (రాయగలగడం/ బొమ్మలు వేయగలగడం).
బదలాయింపు - విద్యా ప్రాముఖ్యం:
ఉపాధ్యాయుడు ఒక విషయాన్ని విద్యార్థికి నేర్పుతున్నప్పుడు దానికి సంబంధించిన వివిధ రంగాలను అనుసంధానం చేయాలి. నిత్య జీవితంలో ఉపయోగపడేలా చూడాలి.
¤ అంతర్ దృష్టి అభ్యసనం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
¤ బదలాయింపు వల్ల 'బట్టీ' తగ్గుతుంది.
¤ దృశ్య శ్రవణ పరికరాల వినియోగం.
¤ సమస్యా పరిష్కార మార్గంలో అభ్యసనం చేయడం మొదలైన మెలకువల ద్వారా బదలాయింపు జరుగుతుంది.
భావనలు
భావనా వికాసం అభ్యసనానికి మూలాంశం. వివిధ వస్తువులు- సంఘటనల మధ్య సంబంధాన్ని, పరిస్థితులను ప్రతీకల ద్వారా తెలపడాన్నే భావన అంటారు. భావనలు ముఖ్యంగా రెండు పద్ధతుల ద్వారా ఏర్పడతాయి.
ఎ) అమూర్తీకరణ పద్ధతి
బి) మూర్తీకరణ పద్ధతి
అమూర్తీకరణ పద్ధతిలో ఒక వస్తువు, సంఘటన, అంశానికి సంబంధించిన విషయాలను నేరుగా విశదపరచవచ్చు. పోలికలు, భేదాలు మొదలైనవాటిని ఉపయోగించరు.
ఉదా: ఏనుగుకు పెద్ద తొండం, చిన్న కళ్లు, స్తంభాల్లాంటి కాళ్లు, పెద్ద చెవులు ఉంటాయని విశదీకరించడం.
మూర్తీకరణ పద్ధతిలో ఒక వస్తువు లేదా సంఘటన లేదా అంశాన్ని వివిధ పోలికలు, తేడాలు, ఉదాహరణలు మొదలైనవాటిని వినియోగిస్తూ ఒక ముగింపునకు వచ్చేలా చేస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని 'మినహాయింపులు' తప్పనిసరిగా ఉంటాయి.
ఉదా: ఆకాశంలో ఎగిరేవి పక్షులు. కానీ, గబ్బిలం పక్షి కాకపోయినా ఎగురుతుంది. పక్షులు గుడ్లు పెడతాయి. జంతువులు పిల్లల్ని కంటాయి.
గమనిక:
విద్యార్థుల్లో మూర్తీకరణం ద్వారా ఏర్పరిచే భావనా వికాసం బలమైన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ఉపాధ్యాయులు నమూనాలు, ప్రయోగాలు దృశ్య, శ్రవణ పరికరాలు మొదలైనవాటి ద్వారా అభ్యసనం జరిపేందుకు కృషి చేయాలి.
పిల్లలు పెరుగుతున్నకొద్దీ అనేక రకాలైన అర్థాలతో కూడిన మాటల ద్వారా భావనలు ఏర్పడతాయి. భావనావికాసంలో గతానుభవాలు మొదలైనవి సహకరిస్తాయి.
భావనా వికాసం - కారకాలు:
ప్రజ్ఞ, మూర్తానుభవాలు, జ్ఞానేంద్రియ సమర్థత భావనా వికాసానికి దోహదం చేస్తాయి. శిశువు ప్రజ్ఞా సామర్థ్యం, శిశువు పొందుతున్న మూర్తానుభవాలు భావనా వికాసంలో ప్రభావాన్ని చూపుతాయి. జ్ఞానేంద్రియాల్లో లోపాలు ఉంటే, భావనా వికాసం నెమ్మదిగా ఉండే అవకాశం ఉంది. అందుకే శిశువుల జ్ఞానేంద్రియాల పనితీరుపై దృష్టి సారించాలి.
వివిధ రకాలైన భావనలు :
1. సంఖ్యా భావనలు :
సంఖ్యల ప్రాధాన్యాన్ని గుర్తించడం, వాటిని వివరణాత్మకంగా వినియోగించగలిగిన సామర్థ్యం సంఖ్యా భావన స్థాయిని సూచిస్తుంది. టెర్మన్, మెర్రిల్‌లు సంఖ్యాభావన వికాసంపై పరిశోధనలు చేశారు. వారి అభిప్రాయం ప్రకారం..
¤ మగపిల్లల కంటే ఆడపిల్లల్లో సంఖ్యాభావన వికాసం ఎక్కువ.
¤ అభ్యసనం, శిక్షణ, తల్లిదండ్రులు తగిన శిక్షణ ఇచ్చినప్పుడు నర్సరీ విధానం, సంఖ్యా భావనకు తోడ్పడుతుంది.
¤ 4 సంవత్సరాల వయసులో రెండు వస్తువులను
¤ 5 సంవత్సరాల వయసులో నాలుగు వస్తువులను
¤ 6 సంవత్సరాల వయసులో పన్నెండు వస్తువులను అర్థవంతంగా లెక్కించగలుగుతారు.
2. కాలం :
నిన్న, నేడు, రేపు, అప్పుడు, ఇప్పుడు, మొదలైనవి స్పష్టంగా అర్థం చేసుకోగలగడం కాల భావన.
¤ ఇది సంఖ్యాభావనపై ఆధారపడుతుంది.
¤ కాలభావన అమూర్త భావన.
¤ శిశువు 5 సంవత్సరాలు దాటిన తరువాతే కాల భావనల్ని స్పష్టంగా ఏర్పరుచుకోగలుగుతాడు.
3. బరువు:
వస్తువుల బరువును సరిగ్గా అంచనా వేయడమే బరువు భావన.
¤ కారును ఎత్తలేమని తెలియక శిశువు దాన్ని ఎత్తేందుకు ప్రయత్నించడమంటే అతడిలో బరువు భావన ఏర్పడలేదని తెలుస్తుంది.
¤ శిశువులు వస్తువులను పడేయటం వెనుక బరువు భావన ఏర్పడకపోవడం అనే అంశం ఇమిడి ఉంది.
¤ వయసు, అనుభవంలో బరువు భావన ఏర్పడి, వృద్ధి చెందుతుంది.
4. ఆత్మ:
నేను ఏమిటి? అనే భావన - ఆత్మభావన. ఇది వయసు, అనుభవాలు, పరిసరాలవల్ల క్రమంగా ఏర్పడుతుంది. ఆత్మభావన ఏర్పడుతున్నకొద్దీ వ్యాకులత తగ్గుతుంది. సర్దుబాటు సామర్థ్యం పెరుగుతుంది. నిజాయితీ ఎక్కువ. ఇతరులతో సంబంధాలు బాగా ఉంటాయి.
5. ప్రాదేశిక భావనలు:
కుడి, ఎడమ, తూర్పు, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం, మూలలు అనే భావనలను ప్రాదేశిక భావనలుగా భావించవచ్చు.
¤ సుమారుగా 5 ఏళ్ల వయసులో కుడి, ఎడమల మధ్య తేడా తెలుస్తుంది.
¤ ప్రాథమిక పాఠశాల వయసులో దిక్కుల్ని గుర్తించ గలగడం.
¤ కౌమార దశలో రెండు వస్తువుల మధ్య దూరాన్ని గుర్తించగలగడం.
¤ వస్తువుల మధ్య దూరాన్ని 'ఎక్కువ/ తక్కువ' అని చెప్పడం ద్వారా ప్రాదేశిక భావనల్ని పెంచవచ్చు.
6. ధనం భావన:
ధనం విలువను గుర్తించడం, వినియోగించడం.
¤ 4, 5 సంవత్సరాల వయసులో డబ్బుతో వస్తువులు కొనవచ్చు అని గుర్తిస్తారు.
¤ 6, 7 సంవత్సరాల వయసులో అర్ధరూపాయి కంటే రూపాయి ఎక్కువ అని గుర్తించగలరు.
¤ ఎనిమిదేళ్ల వయసులో ధనభావన పూర్తిగా ఏర్పడుతుంది.
7. అందం భావన:
అందం అంటే ఏమిటి అని నిర్వచించుకోవడం, అర్థం చేసుకోవడం. అందం భావన వికాసం, సంస్కృతి, సామూహిక ప్రమాణాలు, పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. శిశువులో ఏ వయసులో నిర్దిష్టంగా ఏర్పడుతుందో చెప్పలేం.
8. జీవితం-మరణం:
జీన్ ఫియాజీ జీవితం-మరణం అనే అంశాలపై పరిశోధన చేశారు.
¤ చిన్న వయసులో జీవించడం/ మరణించడం మధ్య తేడా తెలియదు.
¤ 4 నుంచి 6 సంవత్సరాల మధ్య చలనం ఉన్న వస్తువులను కూడా జీవులుగానే భావిస్తారు. చలనంలేని వాటిని నిర్జీవులుగా భావిస్తారు. బస్సు, రైలు వంటివి కూడా వారి దృష్టిలో జీవులే.
¤ 6-7 సంవత్సరాల మధ్య చంద్రుడు కూడా వారికి జీవే.
¤ 8-10 సంవత్సరాల మధ్య స్వయం చలనం, ఆధారిత చలనం మధ్య భేదాన్ని గుర్తించగలరు.
¤ పదకొండేళ్ల వయసు నుంచి జంతువులు, వృక్షాలు మాత్రమే ప్రాణులని గుర్తిస్తారు.
9. కారణ-ఫలిత సంబంధం:
వయసు పెరుగుతున్న కొద్దీ అనుభవం వల్ల ఈ భావన క్రమంగా వికసిస్తుంది. 8, 9 సంవత్సరాల మధ్య ఈ భావన గుర్తించదగిన స్థాయిలో ఉంటుంది. ఎనిమిదేళ్ల వయసులో తన జననం వెనుక తల్లి పాత్రను అర్థం చేసుకుంటారు.
¤ జానపద కథలు, పురాణాలు చదవడం/ వినడం వల్ల ఈ భావనని త్వరగా పెంచవచ్చు.
No comments:
Post a Comment