ప్రతి ప్రవర్తనామార్పు అభ్యసనమే!
అభ్యసన బోధనల మనోవిజ్ఞాన శాస్త్రం
వ్యక్తి మనుగడకు అవసరమైన అనేక విషయాలను, ఇతర లక్షణాలను ఆర్జించుకునే ప్రక్రియను అభ్యసనం అంటారు. పెరుగుదల, అనుభవాల వల్ల వ్యక్తి జీవితంలో మార్పులొస్తాయి. ఈ మార్పులనే అభ్యసనంగా భావిస్తారు. అయితే పెరుగుదల వల్ల వచ్చే మార్పులు (శారీరక మార్పులు) అభ్యసనాలు కావు.అభ్యసన బోధనల మనోవిజ్ఞాన శాస్త్రం
నిర్వచనాలు
''అనుభవం, శిక్షణల వల్ల వ్యక్తి ప్రవర్తనలో సంభవించే మౌలిక మార్పు అభ్యసనం.'' - గేట్స్, జర్సీల్డ్
''వ్యక్తి ప్రవర్తనలో సాపేక్షంగా కలిగే స్థిరమైన, శాశ్వతమైన మార్పు''. - బెర్న్‌హార్డ్
''అనుభూతుల ఫలితంగా ప్రవర్తనలో కలిగే దృఢతరమైన లేదా బలహీనపడిన మార్పు''. - స్మిత్
''ప్రతి ప్రవర్తనామార్పు అభ్యసనమే.'' - గార్డెనర్ మర్ఫీ
''ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధం ఏర్పరిచే ప్రక్రియ.'' - బోజ్
''అవరోధాలను అధిగమించడానికి తోడ్పడే సర్దుబాటు చర్య.'' - క్రో అండ్ క్రో
''ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు.'' - హెర్జన్‌హాన్
''ప్రగతిపథం వైపు ప్రవర్తనా మార్పు.'' - స్కిన్నర్
''ఇది వికాసం కలిగించే కార్యక్రమం.'' - ఉడ్‌వర్త్
''పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనలో ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పు.'' - డెసెకో
¤ అభ్యసన ప్రక్రియలో ప్రేరణ, గమ్యం, సర్దుబాటు, గమ్యాన్ని చేరడం అనే సోపానాలుంటాయి. అవసరం, ప్రేరణలను కలిగిస్తే, సర్దుబాటు అవరోధాలను అధిగమించేలా సహకరిస్తుంది.
¤ అభ్యసనంలో అభ్యసించే వ్యక్తి, అభ్యసనాంశం, అభ్యసన సన్నివేశం అనే అంశాలుంటాయి.
¤ అభ్యసన ప్రక్రియ లక్షణాలను వివరించింది - మెక్ గియోజ్, ఇరియస్.
¤ అభ్యసన సార్వత్రికం, జీవిత పర్యంతం, ప్రయోజనాత్మకం, గమ్య నిర్దేశకం, సంచితం, బదలాయింపునకు వీలవుతుంది. సమ/ విషమయోజనాలు కలిగిస్తుంది.
¤ ప్రయోజనం ఆధారంగా అభ్యసనంలో అనేక రకాలుంటాయి.
¤ కాళ్లు, చేతులు మొదలైన శరీర అవయవాలను ఉపయోగిస్తూ కౌశలాలు నేర్వడం చలన అభ్యసనం.
¤ చిన్న చిన్న మాటలు, పదాలు, వాక్యాలు నేర్వడం శాబ్దిక అభ్యసనం.
¤ రెండు సన్నివేశాల మధ్య పోలికలు, భేదాలు గుర్తించడం విచక్షణాభ్యసనం.
¤ అనుభవం ద్వారా తనంతటతాను తెలుసుకోవడం ప్రత్యక్ష అభ్యసనం.
¤ సామాన్య లక్షణాలు గుర్తించి భావన ఏర్పరచు కోవడం భావనాత్మక అభ్యసనం.
¤ పరిశీలన, ఆలోచన, వివేచనల ద్వారా ఫలితాన్ని తెలపడం సమస్యాపరిష్కార అభ్యసనం.
¤ వైఖరి, అభిరుచి, ప్రశంసనీయతలు కూడా అభ్య సించడం వల్లే పెంపొందుతాయి.
¤ అభ్యసన ప్రక్రియలో సంసిద్ధత (ప్రేరణ), అవధానం (ఏకాగ్రత) ఉన్నప్పుడు అభ్యసించే అంశం ఎక్కువకాలం మనసులో నిలబడుతుంది. (ధారణ).
¤ అభ్యసనపై పనిచేసే శారీరక కారకాల్లో వయసు, పరిణతి, అలసట ముఖ్యమైనవి.
¤ శారీరక కారకాల మాదిరి మానసిక కారకాల్లో ప్రజ్ఞా వైవిధ్యాలు, పాఠశాల కారకాల్లో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి, కుటుంబ కారకాల్లో తల్లిదండ్రుల ప్రవర్తన అభ్యసనంపై ప్రభావాన్ని చూపిస్తాయి.
అభ్యసన సిద్ధాంతాలు :
అభ్యసనం ఎలా సంభవిస్తుందో వివరించే అంశాలను అభ్యసన సిద్ధాంతాలుగా పేర్కొనవచ్చు.
¤ వీటితోపాటు ఆల్బర్ట్ బందూరా తెలిపిన పరిశీలనాభ్యసనం, బ్రూనర్ ప్రతిపాదించిన ఆవిష్కరణ అభ్యసనం కూడా ముఖ్యమైనవే.
¤ యత్నదోష సిద్ధాంతాన్ని సంసర్గవాదం, సంధానవాదం, విజయపథావరణ సిద్ధాంతం, S - R సిద్ధాంతం అనికూడా పిలుస్తారు.
¤ థార్న్‌డైక్ ప్రతిపాదించిన ఈ సిద్ధాంతంలో పజిల్ పెట్టెలో ఉన్న పిల్లి అనేక ప్రయత్నాల్లో యాదృచ్ఛికంగా గమ్యాన్ని చేరగలిగింది. వ్యర్థ కదలికలను వదిలివేసి విజయవంతమైన కదలికల్లో ప్రావీణ్యం సంపాదించడమే యత్నదోష అభ్యసనం.
¤ థార్న్‌డైక్ అభ్యసన ప్రధాన నియమాలు (3), అనుబంధ అభ్యసన నియమాలు (7) తెలిపారు.
¤ థార్న్‌డైక్ అభ్యసన నియమాల్లో అత్యంత ఆమోద యోగ్యమైంది సంసిద్ధతా సూత్రం. ప్రధానమైంది ఫలిత సూత్రం.
¤ అభ్యాస సూత్రంలో నవ్యత్వ సూత్రం, పునర్వర్తన సూత్రాలున్నాయి. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య సంధానం అనేకసార్లు జరగడం వల్ల (ఉపయుక్తత, నిరుపయుక్తతల వల్ల) అభ్యసన క్రియలో నైపుణ్యం వస్తుంది.
¤ అభ్యసన ప్రక్రియలో ప్రేరణ క్రమబద్ధంగా పాఠ్యాంతరం వరకు కొనసాగేలా ఉండాలి.
¤ అనుబంధ పాఠ్యాంశాలు చదవడం, పునస్మరణ చేసుకోవడం ద్వారా అభ్యాసం కలుగుతుంది.
¤ అభ్యసన కృత్యాలు విజయం సాధించి సంతృప్తి చెందేవిగా ఉండాలి.
¤ దక్షత పెరిగితే అభ్యసనానికి పట్టేకాలం తగ్గుతుంది. అని కాల వ్యవధి నియమం తెలుపుతుంది.
¤ బహుమతులు, పొగడ్తలు, దండనలు ప్రేరణ కారకాలుగా పనిచేస్తాయి.
¤ అంశాల మధ్య సారూప్యత - పోలిక ఉన్నట్లయితే అభ్యసన సులభతరమవుతుంది.
¤ అనుబంధ అంశాలు, సంబంధిత విషయాలున్నప్పుడు కూడా నేర్చుకోవడం తేలికవుతుంది.
¤ కొన్ని విషయాలపైనే ప్రతిస్పందించి కొన్నింటిని వదిలి వేయడం జరుగుతుంది. కాబట్టి అభ్యసనాంశం చిన్నచిన్న విభాగాలుగా ఉండాలని పాక్షికచర్య నియమం తెలుపుతుంది.
¤ బహుళ ప్రతిస్పందనలు అభ్యసన వేగాన్ని తగ్గిస్తాయి.
శాస్త్రీయ నిబంధన:
సహజ ఉద్దీపనకు ఏర్పడే సహజ ప్రతిస్పందనను కృత్రిమ ఉద్దీపనకు కూడా రాబట్టవచ్చని ఇవాన్ పావ్‌లోవ్ నిరూపించారు.
నిబంధిత అభ్యసనం మూడు దశల్లో జరుగుతుంది.
1. సహజ ఉద్దీపన సహజ ప్రతిస్పందన
(UCS UCR)
2. అసహజ ఉద్దీపన - సహజ ఉద్దీపన సహజ ప్రతిస్పందన
(CS - UCS UCR)
3. నిబంధిత ఉద్దీపన నిబంధిత ప్రతిస్పందన
(CS CR)
¤ పావ్‌లోవ్ శాస్త్రీయ నిబంధనను వాట్సన్ నిబంధిత ప్రతిస్పందనగా ఆల్బర్ట్ అనే పిల్లవాడిపై తెల్ల ఎలుకల ప్రయోగం ద్వారా నిరూపించాడు.
¤ ముందుగా సహజ ఉద్దీపన ఇస్తే పురోగామి నిబంధన, ముందుగా అసహజ ఉద్దీపనను ఇస్తే తిరోగామి నిబంధన ఏర్పడతాయి.
¤ సహజ, అసహజ ఉద్దీపనల మధ్య కాల వ్యవధి ఎక్కువైతే అభ్యసన జరగదు.
¤ నిబంధిత అభ్యసనం ద్వారా సహజ ప్రతిస్పందన కొనసాగడాన్ని సకారాత్మక నిబంధన అనీ, కొనసాగకపోవడాన్ని, నకారాత్మక నిబంధన అనీ అంటారు.
¤ తెల్ల ఎలుకకు భయపడే పిల్లవాడు తెల్ల కాగితాన్ని చూసి కూడా భయపడటాన్ని సామాన్యీకరణ అంటారు.
¤ బడి గంటకు, గుడి గంటకు తేడా గుర్తించడమే ఉద్దీపన విచక్షణ.
¤ ఇంజక్షన్ అంటే భయపడే పిల్లవాడు డాక్టరు పేరు వినగానే భయపడటం ఉన్నతస్థాయి నిబంధన.
¤ కృత్రిమ సహజ ఉద్దీపనలను వెంట వెంటనే ఇవ్వకపోవడం వల్ల బంధం బలహీనపడటాన్ని డీ కండిషనింగ్ అంటారు.
¤ కేవలం అసహజ ఉద్దీపన మాత్రమే ఇవ్వడం వల్ల ప్రతిస్పందనను పోగొట్టడాన్ని విలుప్తీకరణం అంటారు. పదేపదే ఇవ్వడాన్ని పునర్బలనం అంటారు.
¤ కొన్ని నిబంధిత అభ్యసనాలు విలుప్తీకరణం జరిగినా కూడా తిరిగి తటాలున ప్రతిస్పందనలనిస్తాయి. దీన్నే అయత్నసిద్దస్వాస్త్యం అంటారు.
కార్యసాధక నిబంధన:
పరికరాత్మక, యాంత్రిక కార్యసాధక నిబంధనను ప్రతిపాదించింది బి.ఎఫ్.స్కిన్నర్.
¤ స్కిన్నర్ ప్రకారం ప్రతిస్పందనలు రెండు రకాలు.
1. రాబట్టిన ప్రతిస్పందనలు - నిర్గమాలు
2. బయటికి వదిలిన ప్రతిస్పందనలు - ఉద్గమాలు
¤ ఉద్దీపనలు లేకపోయినా వెలువడే ప్రతిస్పందనలు ఉద్గమాలు. స్కిన్నర్ ప్రయోగం దీన్ని బలపరుస్తుంది. దీన్ని R- Type సిద్ధాంతం అంటారు.
¤ స్కిన్నర్ బాక్స్‌లోని ఎలుక మీట నొక్కడం ద్వారా ఆహారం పొందడమనే కార్యసాధక ప్రవర్తనను పునర్బలనం ద్వారా బలపరుచుకుంటుంది. స్వీయ ప్రేరణ ద్వారా ప్రతిచర్య జరుగుతుంది.
¤ స్కిన్నర్ - కార్యసాధక నిబంధన ద్వారా కార్యక్రమయుత అభ్యసనం బోధనా యంత్రం మొదలైనవాటిని సిడ్నీ ఎల్.ప్రెస్సీ రూపొందించాడు.
¤ కార్యసాధక నిబంధన థార్న్‌డైక్ ఫలిత సూత్రాన్ని శాస్త్రీయ నిబంధన సామీప్యతా సూత్రాన్ని ప్రతిబింబిస్తాయి.
అంతర దృష్టి అభ్యసనం
¤ వర్దిమియర్, కోహెలర్, కోఫ్కా మొదలైన గెస్టాల్ట్ వాదులు ప్రవేశపెట్టిన సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని అంతర దృష్టి అభ్యసనం అంటారు.
¤ 'గెస్టాల్ట్' అనేది జర్మన్ పదం. ఈ పదానికి అర్థం వ్యవస్థీకృత మొత్తం.
¤ సమస్య కఠినత్వ స్థాయి, అంశ పరిజ్ఞానలేమి, అంశ సమన్వయ అవకాశలేమి అనేవి థార్న్‌డైక్ ప్రయోగంలోని దోషాలుగా వీరు గుర్తించారు.
¤ టెనరిఫ్ దీవుల్లో 'సుల్తాన్' అనే చింపాంజీపై చేసిన ప్రయోగాలను విశ్లేషించే గ్రంథమే మెంటాలిటీ ఆఫ్ ఏప్స్.
¤ సమస్యా పరిష్కారం ప్రయత్నాల రూపంలో కాకుండా తటాలున మెదడులో మెదిలో మేధో తరంగం రూపంలో ఉంటుంది. దీన్నే అంతరదృష్టి అభ్యసనం అంటారు.
¤ నిశిత పరిశీలన, అవధానం, తీక్షణ యోచన హఠాత్తుగా సరైన ప్రతిస్పందననివ్వడమనే లక్షణాలు దీనిలో వ్యక్తమవుతాయి.
¤ ఇది సంక్లిష్టమైన అభ్యసన విధానం. సంజ్ఞానాత్మక, మానసిక, శాబ్దిక అభ్యసనాలు జరగడానికి ఉపక రిస్తుంది. పునరావృతాల అవసరం ఉండదు.
¤ అంశాన్ని మొత్తంగా పరిశీలించి విడివిడి భాగాలుగా విభజించి నేర్చుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది.
పరిశీలనాభ్యసనం
¤ అనుకరణ - యత్నరహిత - పరిశీలనాభ్యసనం ప్రతిపాదించింది ఆల్బర్ట్ బందూరా.
¤ మిల్లర్, డిలార్డ్ రచించిన సామాజిక అభ్యసనం అనుకరణ గ్రంథంలో పరిశీలనాభ్యసన విధానాన్ని వివరించారు.
¤ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ గ్రంథంలో బందూరా దీన్ని సిద్ధాంతీకరించారు.
¤ ఆచరింపదగిన మాదిరులను నవ్యత, నిశిత పరిశీలనల ద్వారా అనుకరించాలి.
¤ ఈ పద్ధతిలో ఆర్జన, ధారణ, నిష్పాదన, ప్రేరణ అనే సోపానాలుంటాయి.
¤ శీల నిర్మాణానికి, సమగ్ర మూర్తిమత్వ వికాసానికి పరిశీలనలు తోడ్పడతాయి.
ఆవిష్కరణ అభ్యసనం
¤ ఏ విషయాన్నైనా ఏ వయసువారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చనే ప్రాథమిక సూత్రం ఆధారంగా జీరోం బ్రూనర్ ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
¤ క్రమంలో అమర్చిన అభ్యసనాంశాలు విద్యార్థి స్వయంగా నేర్చుకున్న ట్లయితే ఎక్కువ కాలం ధారణలో ఉంటాయి.
¤ అభ్యసన ప్రయోజనాత్మకం, గమ్యనిర్దేశకం, కుతూహలం, సరళం, అన్వేషణాత్మకంగా ఉండాలి.
¤ శిశువుల పెరుగుదలనుబట్టి నటనా పద్ధతి, చిత్రపట పద్ధతి, ప్రతీకాత్మక పద్ధతులు ఉపయోగించాలి.
¤ ఉపాధ్యాయుడి పాత్ర తక్కువగా ఉండాలి. అంతర్గత ప్రేరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
¤ బోధనోపకరణాలుండటం ద్వారా, చేయడం ద్వారా నేర్చుకోవడానికి వీలు కలుగుతుంది.
¤ పొగడ్తలు, ప్రశంసలు, బహుమతులు పునర్బలనం కలిగిస్తాయి.
¤ పిల్లలు సాధించగల లక్ష్యాలు మాత్రమే నిర్దేశించి చేరుకునేలా ప్రోత్సహించాలి.
అభ్యసన బదలాయింపు
¤ ఒక విషయ పరిజ్ఞానం మరొక విషయం నేర్చుకోవడంపై ప్రభావం చూపడాన్ని అభ్యసన (శిక్షణ) బదలాయింపు అంటారు.
¤ బదలాయింపు భావనను సమర్థించింది గారెట్. బదలాయింపు సాధ్యంకాదని తెలిపింది విలియం జేమ్స్.
¤ గణిత పరిజ్ఞానం ఇతర అంశాలు నేర్చుకోవడానికి సహకరిస్తుందని తెలిపింది ఫార్మల్ డిసిప్లిన్.
¤ ఈత నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ పరిజ్ఞానం పొందడంలో ఈత పరిజ్ఞానం ఏ మాత్రం తోడ్పడక పోవడమే శూన్య బదలాయింపు.
¤ రసాయన శాస్త్రంలో పరమాణు నిర్మాణం ఆధునిక భౌతికశాస్త్రం చదవడంలో కూడా తోడ్పడుతుంది. దీనిని అనుకూల బదలాయింపు అంటారు.
¤ హిందూ సంఖ్యామానంలో స్థాన విలువలు నేర్చుకున్న విద్యార్థి ఆంగ్ల సంఖ్యామానంలో ఇబ్బంది పడటాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు.
¤ కుడిచేతితో రాయగలిగే వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలగడాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అంటారు.
¤ కుడిచేతితో చిత్రాలు గీయగలిగిన వ్యక్తి కుడి కాలితో కూడా చిత్రించగలగడాన్ని ఏకపార్శ్వ బదలాయింపు అంటారు.
¤ రెండు విషయాల మధ్య సామ్యత, సారూప్యత ఉన్నప్పుడు బదలాయింపు జరుగుతుందని థార్న్‌డైక్ సమరూప మూలకాల సిద్ధాంతం ద్వారా వివరించాడు. దీనిని ఉడ్‌వర్త్ బలపరచాడు.
¤ విషయాల మధ్య సాధారణీకరణలున్నప్పుడు బదలాయింపు జరుగుతుందని ఛార్లెస్ జడ్ సాధారణీకరణ సిద్ధాంతం ద్వారా వివరించగా దీనిని హెండ్రిక్ సన్ ప్రయోగాత్మకంగా వివరించాడు.
¤ అంతర్భాగాల మధ్య సంబంధం అర్థం చేసుకున్నప్పుడు బదలాయింపు జరుగుతుందని గెస్టాల్ట్‌వాదులు సమగ్రాకృతి సిద్ధాంతం ద్వారా వివరించారు.
¤ ఆదర్శాలను నిజ జీవితంలో అన్వయించుకోవచ్చునని అదర్శాల సిద్ధాంతంలో బోగ్లే వివరించారు.
¤ ప్రజ్ఞాపాటవాలు, అంతర్గత ప్రేరణ, విషయ పరిజ్ఞానం, ఆదర్శ బోధనా పద్ధతులు బదలాయింపును పెంపొందించే కారకాలుగా ఉంటాయి.
No comments:
Post a Comment