Study Material for APTET and DSC

Study Material for APTET and DSC

Thursday, 22 March 2012

APTET Telugu Notes (కష్టజీవి)

కష్టజీవి

              
కష్టజీవి పాఠ్యభాగ రచయిత గుర్రం జాషువా. 1895లో గుంటూరు జిల్లా- వినుకొండలో జన్మించారు. జాషువాకు కవితా విశారద, నవయుగ కవిచక్రవర్తి, మధురశ్రీనాథ, కవికోకిల అనే బిరుదులున్నాయి. జాషువా అనగానే గుర్తొచ్చే కావ్యం 'గబ్బిలం'. జాషువాను దళితకవిగా, గబ్బిలం కావ్యాన్ని దళితకావ్యంగా పేర్కొంటున్నారు. అయితే, గబ్బిలం 'అస్పృశ్యత'ను ఎండగడుతూ, దేశాభిమానాన్ని రేకెత్తిస్తూ రాసిన కావ్యం. గబ్బిలం ద్వారా కైలాసంలో వున్న ఈశ్వరుడికి సందేశం పంపడమే కావ్య ఉద్దేశం. గబ్బిలం సందేశకావ్యం. 'మేఘసందేశం' కావ్యం స్ఫూర్తిగా గబ్బిలంను రాశారు.
''
నాదు కన్నీటి కథ సమన్వయము సేయ
ఆర్ద్ర హృదయమ్ము కూడ కొంతవసరంబు''
               
అన్నాడు జాషువా. గబ్బిలం కావ్యం రెండు భాగాలు. జాషువాపై భాస్కరచౌదరి, ఎండ్లూరి సుధాకర్ వంటివారు పుస్తకాలు రచించారు. జాషువా రచించిన 'క్రీస్తుచరిత్ర'కు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. ఆయన రచించిన మరో గొప్ప కావ్యం 'ఫిరదౌసి'. పారశీకవి ఫిరదౌసి 'షానామా' కావ్యం రాసి పొందిన అవమానమే కావ్యంలోని ఇతివృత్తం. జాషువా ఇవే కాకుండా ముంతాజమహల్, స్పప్నకథ, నేతాజీ, బాపూజీ, ముసాఫిర్లు వంటివి రచించాడు. 'నా కథ' అనేది జాషువా పద్య రూపంలో రాసిన స్వీయచరిత్ర. జాషువా 1971లో మరణించాడు.
'కష్టజీవి' అనే పాఠ్యభాగం గబ్బిలం - మొదటిభాగం లోనిది. పాఠ్యభాగ సారాంశం:
               
తెలుగు కవిత్వానికి ఆశ్రయమిచ్చిన రఘునాథనాయకరాజు పాలించిన తంజావూరుకు దక్షిణభాగంలో ఒక కష్టజీవి (లేదా దళితుడు) నిరుపేదగా, నీతిగా జీవిస్తున్నాడు. అతడు ఉన్నదాంతోనే సంతృప్తి చెందేవాడు. ఒక ముద్ద భోజనంతో కష్టాలను మరచిపోతాడు. నాలుగు దిక్కులున్నా దిక్కులేనివాడయ్యాడు. దళితుడు భారతమాతకు కడగొట్టు బిడ్డడిగా జన్మించాడు.
               
తన కులాన్ని, సంపదను కాజేసిన భారతీయుడి పాదాలు కందకుండా అతడికి చెప్పులు కుట్టి జీవిస్తాడే తప్ప ఎప్పుడూ తిరుగుబాటు చెయ్యలేదు. భరతభూమి ఇతడి సేవకు నిజంగా రుణపడి ఉంది సుమా! కష్టజీవి శ్రమించకపోతే పంటలే పండవు. తను శ్రమించి లోకానికి తిండి పెడతాడు గానీ, తనకు తినడానికి తిండి ఉండదు. ఇదీ ఇతడి దుస్థితి!
               
దళితుడి తలమీద అస్పృశ్యత అనే బురదను పులిమారు. దాన్ని కడిగే దయ పవిత్రమైన గంగకే లేదు. దళితుడి చూపుపడితే నైవేద్యం లేక త్రిమూర్తులూ పస్తు ఉండవల్సిందేనని జాషువా చమత్కరిస్తూనే అంటరానితనం తీవ్రతను వ్యక్తపరిచాడు. ఇక్కడ పాముకు పాలు పోస్తారు! చీమకు పంచదార వేస్తారు. కానీ, హానీ చెయ్యని దళితుడిని హీనంగా చూస్తారు. కర్మభూమి అని పేరు పడ్డ దేశంలో పుట్టిన ధర్మదేవతకు కూడా దళితుడిపై మమకారం లేదు. భగవంతుడికే కనికరం లేకపోతే మనిషి గురించి వేరే చెప్పాలా?    
               
దళితుడి రక్తాన్ని పీల్చి అతడిని పిప్పి చేస్తోంది దరిద్ర దేవత. నాలుగు వర్ణాల పడగలున్న హిందూ నాగరాజు దళితుడి గాలి సోకితేనే కసరుకొంటుంది. 'పెళ్లి చేసుకొని, కుమారులను పుట్టించి, తనలాగే వాళ్లను కూడా బానిసలుగా తయారు చేయడం ఎందుకు?' అనే భావనతో దళితుడు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం అవలంబించాడు.
మానవుల స్వభావం చాలా విచిత్రమైంది. బొమ్మల పెళ్లిళ్లు చెయ్యడానికి వందలు, వేలు ఖర్చు పెడతారు తప్ప, పేదవారు, పకీర్ల పాత్రల్లో ఒక్క మెతుకు కూడా వెయ్యరు. అవునులే- ముప్పయిమూడు కోట్ల దేవతలున్న దేశంలో పండిన పంట అంతా వారి నైవేద్యానికే సరిపోతుంది. ఇక నా బోటి పేదల ఆకలి ఎలా తీరుతుంది?
ముఖ్యమైన అర్థాలు:
         
కాసు - ఒకప్పటినాణెం. దమ్మిడిలో అయిదోవంతు
         
తనివి - తృప్తి; క్షుత్తు - ఆకలి
         
అరుంధతీసుతుడు - దళితుడు (పంచముడు)
         
ఉర్వర - భూమి; కైత - కవిత; అవని - భూమి
         
సస్యరమ - ధాన్యలక్ష్మి; ప్రాక్తనము - ప్రాచీనమైన
         
మేదిని - భూమి; పంకిలము - బురద
         
అనలము - అగ్ని
పర్యాయపదాలు
         
నృపాలకుడు - రాజు, ప్రభువు, అవనిపతి
         
దేహము - తనువు, శరీరం
         
ఉర్వర - భూమి, పృథ్వి, అవని
         
గాలి - పవనం, వాయువు
         
కనికరం - దయ, కరుణ
సందర్భవాక్యాలు:
            ''
జన్మమెత్తె భరతోర్వరకుంగడగొట్టు బిడ్డడై''
            ''
అప్పువడ్డది సుమీ భరతావని వీని సేవకున్''
            ''
ప్రపంచమునకు భోజనము బెట్టు, వానికి భుక్తి లేదు''
            ''
నాల్గు పడగల హైందవ నాగరాజు''
            ''
వాని నైవేద్యమున నంటువడిననాడు
           
మూడు మూర్తులకునుగూడ గూడులేదు''
            ''
ఉలికిపడు జబ్బుగలదు వీడున్నచోటు''
            ''
భాగ్యవిహీనుల క్షుత్తులాఱునే''
            ''
వాడు జరుపసాగె బ్రహ్మచర్యదీక్ష''
సంధులు:
           
దిక్కరియున్న- దిక్కరి + ఉన్న - యడాగమ సంధి
           
క్షుధానల-క్షుధ + అనల - సవర్ణదీర్ఘసంధి
           
జన్మమెత్తె-జన్మము + ఎత్తె - ఉకార సంధి
           
భరతోర్వర-భరత + ఉర్వర - గుణసంధి       
అప్పరమ- + పరమ - త్రికసంధి
           
చెప్పులుగుట్టి-చెప్పులు + కుట్టి - గసడదవాదేశ సంధి
           
జీవనముసేయు-జీవనము + చేయు - గసడదవాదేశ సంధి
           
లేదయ్యె-లేదు + అయ్యె - ఉకార సంధి
           
అప్పువడ్డది-అప్పు + పడ్డది - గసడదవాదేశ సంధి
సమాసాలు
       
క్షుధానలము - క్షుధ అనెడి అనలము - రూపక సమాసం
       
అరుంధతీసుతుడు - అరుంధతి యొక్క సుతుడు - షష్ఠీతత్పురుష సమాసం
       
రఘునాథనృపాలకుడు - రఘునాథుడు అనుపేరుగల నృపాలకుడు - సంభావనాపూర్వపద కర్మధారయ సమాసం
       
సస్యరమ - సస్యమనెడిరమ - రూపక సమాసం
      
అభాగ్యుడు - భాగ్యములేనివాడు - నఙ్‌బహువ్రీహి
      
మూడు కోట్లు - మూడు సంఖ్యగల కోట్లు - ద్విగుసమాసం
వ్యతిరేకార్థాల పదాలు:
            
దరిద్రుడు × సంపన్నుడు (భాగ్యవంతుడు, ధనికుడు)
            
పాపం × పుణ్యం
            
ధర్మం × అధర్మం
చాటువులు
              
చాటువు అంటే ప్రియమైన అని అర్థం. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు ఆశువుగా చెప్పిన పద్యాన్ని చాటుపద్యం అంటారు. వేములవాడ భీమకవి తొలిచాటు కవిగా కొందరి అభిప్రాయం. చాటు కవిత్వానికి వస్తువు కానిదంటూ ఉండదు. కొన్ని చాటువులకు కర్త తెలియదు. వేటూరి ప్రభాకరశాస్త్రి, దీపాల పిచ్చయ్యశాస్త్రి చాటు పద్యాలను సేకరించి ప్రచురించారు.
              
చాటువులు అనే పాఠ్యభాగంలో ఏడు చాటు పద్యాలున్నాయి. మొదటి పద్యం శ్రీనాథుడి చాటువుగా ప్రసిద్ధం. పలనాడు వెళ్లినప్పుడు, దాహం వేస్తే నీరు దొరకనప్పుడు చెప్పిన పద్యం- ''సిరిగలవానికి చెల్లును...'' అనే పద్యం
సిరిగలవాడు అంటే విష్ణుమూర్తి (కృష్ణుడు)
తరుణులు అంటే స్త్రీలు
తిరిపము అంటే బిచ్చమెత్తుకోవడం (శివుడు భిక్షమెత్తుతాడని)
ఆండ్రు అంటే భార్యలు
               ''
శ్రీకృష్ణుడికి పదహారువేల మంది స్త్రీలున్నా ధనవంతుడు కాబట్టి ఫరవాలేదు. బిచ్చమెత్తుకొనే శివా! నీకు ఇద్దరు భార్యలెందుకు? నీకు పార్వతిచాలుగానీ గంగను నాకిచ్చెయ్యి'' అని భావం. ఇందులో వ్యంగం ఉంది. గంగ అంటే నీరు. కాబట్టి, నాకు నీటినిచ్చి దాహం తీర్చమన్నాడు. చమత్కారంగా చెప్పిన మంచి చాటు పద్యం ఇది.
               ''
తముదామె వత్తురర్థులు...'' అనే పద్యాన్ని క్షేత్రయ్య తంజావూరు నాయకరాజు రఘునాథ నాయకుడి ఆస్థానాన్ని దర్శించి చెప్పాడని తెలుస్తోంది.    
 ఔచిత్యం తెలిసిన దాత వద్దకు యాచకులు తమంత తామే వెళ్తారు. ఎవరూ పిలవనక్కరలేదు. పద్మాలున్న సరస్సులోకి తుమ్మెదలను రమ్మని ఎవరైనా పిలుస్తున్నారా? లేదు కదా?
             
భ్రమరం అంటే తుమ్మెద. తుమ్మెదలు మరకందం కోసం వాటంతట అవే పద్మాల మీద వాలతాయి గదా! అని భావం. అలాగే, ఇచ్చేవారి వద్దకే యాచకులు వెళ్తారు.
              ''
ఒక్కడు మాంసమిచ్చె... '' అనే చాటు పద్యం రాయన భాస్కరుడు అనే మంత్రిని ఉద్దేశించి చెప్పినది. శిబి చక్రవర్తి ఒక పావురాన్ని కాపాడటానికి తన శరీరాన్నే కోసి ఇచ్చాడు. తన సహజసిద్ధమైన కవచ కుండలాలను కోసి ఇచ్చినవాడు కర్ణుడు. తన వెన్నెముకను ఇంద్రుడికి ఆయుధంగా ఇచ్చినవాడు దధీచి. వామనుడికిచ్చిన మాట ప్రకారం తన ప్రాణమే ఇచ్చింది బలిచక్రవర్తి. వీరంతా బతకలేక పనులు చెయ్యలేదు. మంచి కీర్తి కోసం చేశారు. కాబట్టే, త్యాగధనులుగా, గొప్ప దాతలుగా నిలిచి పోయారు.
అస్థి అంటే ఎముక. పద్యంలోని దాతలను అర్థం చేసుకోవాలి. వాచ్యం చెయ్యలేదు.
కందుకూరి రుద్రకవి 'రాజు' శబ్దాన్ని చమత్కారంగా
ప్రయోగించి చెప్పిన పద్యం ''రాజును రాజుగాడతడు...'' ప్రసిద్ధం.
రాజు అంటే ప్రభువు, చంద్రుడు అని అర్థాలు.
వాహినీ రాజు అంటే సముద్రుడు.
శరాహతి అంటే బాణాల దెబ్బ
దేవతా రాజు అంటే ఇంద్రుడు
రావణసూతి అంటే రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు
ఆజి అంటే యుద్ధం
            
చాటుపద్యంలో మల్కిభరాముడు అనే రాజును స్తుతించడమే లక్ష్యం. ఇబ్రహీం కుతుబ్‌షాకి మల్కిభరాముడనే పేరుంది. రాజు చాలా గొప్పవాడనటానికి ఇతరులతో పోలిక తెచ్చి చెప్పిన పద్యమిది. చంద్రుడు పేరుకే రాజు గానీ, అసలు రాజే కాదు. ఎందుకంటే అతడిని రాహువు మింగుతాడు కాబట్టి. నదులకు రాజుగా పేరున్న సముద్రుడు కూడా రాజు కాదు- రాముడు విల్లు ఎక్కుపెట్టగానే వణికిపోయినవాడేమి రాజు? ఇక దేవతల రాజైన ఇంద్రుడూ రాజు కాదు. ఎందుకంటే రావణుడి కొడుకైన ఇంద్రజిత్తు చేతిలో ఓడిపోయాడు. మరి అసలైన రాజెవరు? అంటే లోకంలో ఇబ్రహీం కుతుబ్‌షా- మల్కిభరాముడే రాజు. అంటే రాజు అనే పదానికి ఇతడే తగినవాడు.
            
రాజమండ్రిలో బిపిన్ చంద్రపాల్ ఆంగ్లోపన్యాసాన్ని తెలుగులో అనువదిస్తూ చివర ఆశువుగా చెప్పిన పద్యం- ''భరత ఖండంబు...!'' భారతదేశం ఒక చక్కని పాడియావు వంటిది. భారతీయులు లేగ దూడల వంటి వారు. పాలు తాగడానికి సన్నద్ధమవుతున్న లేగదూడల్ని ఏడిపిస్తూ మూతులు బిగగట్టి తెల్లవారు (ఆంగ్లేయులు) అనే గడుసరి గొల్లవారు పాలు పితుక్కుపోతున్నారు. అంటే ఆంగ్ల పాలకులు మన దేశ సంపదను మనకు కాకుండా కొల్లగొట్టుకుపోతున్నారని భావం.
             ''
శివుడద్రిని శయనించుట...'' అనే పద్యం చమత్కార చాటువు. కర్త తెలీదు. నల్లి బాధను చమత్కరిస్తూ ఇలా అంటాడు- నల్లిబాధ పడలేకే శివుడు పర్వతంపై శయనిస్తాడు. సూర్యచంద్రులు ఆకాశంలో ఉంటారు. విష్ణువైతే పాల సముద్రంలో శేషతల్పంపై పడుకుంటాడు.
వీరంతా నల్లికి భయపడి అటువంటి నివాసాలు ఏర్పరచుకున్నారట.చివరి చాటుపద్యం విద్య అవసరాన్ని వెల్లడిస్తుంది. మానవులకు అక్షరం (చదువు) తప్పక కావాలి. విద్య అనేది నాలుకకు చెరకురసం వంటిది. విద్య మనల్ని రక్షిస్తుంది. లోకం విద్యను రక్షిస్తుంది.
               
అద్రి అంటే కొండ, రాజీవాక్షుడు అంటే విష్ణువు; అవిరళంగా అంటే ఎల్లప్పుడు; కుక్షి అంటే పొట్ట; ఇక్షురసం అంటే చెరకు రసం.
సంధులు:
         
పరమేశ - పరమ + ఈశ - గుణసంధి
         
అచ్యుతేంద్ర -  అచ్యుత + ఇంద్ర - గుణసంధి
         
పాడియావు - పాడి + ఆవు - యడాగమ సంధి
         
రాజీవాక్షుడు - రాజీవ + అక్షుడు - సవర్ణదీర్ఘసంధి
సమాసాలు:
   
రఘునాథనృపాలుడు - రఘునాథుడను పేరుగల నృపాలుడు - సంభావనా పూర్వపద కర్మధారయం
   
రావణసూతి - రావణుడి యొక్క సూతి - షష్ఠీతత్పురుష సమాసము
   
రాజీవాక్షుడు - రాజీవంవంటి అక్షులుగలవాడు - బహువ్రీహి సమాసము
   
అక్షరము - క్షరము కానిది - నఙ్‌తత్పురుష సమాసము
సందర్భ వాక్యాలు:
¤
పరమేశా, గంగవిడుము పార్వతిచాలున్
¤
బ్రదుకనోపకయిచ్చిరొ కీర్తికిచ్చిరో
¤
మల్కియిభరాముడె రాజు ధరాతలంబునన్
¤
భరతఖండంబు చక్కని పాడియావు
¤
నల్లి బాధపడలేక సుమీ
¤
అక్షరంబు జిహ్వకిక్షురసము
పర్యాయపదాలు:
         
తరుణి - పడతి, వనిత, ఉవిద, ఇంతి మొదలైనవి 
         
రాజు- ప్రభువు, అవనిపతి, ఱేడు
         
ఆజి - యుద్ధం, సమరం, సంగరం
         
రవి - సూర్యుడు, భానుడు, అర్కుడు.

No comments:

Post a Comment