సహజ సామర్థ్యాలు వికసించడమే పరిణతి!
అభ్యాసకుడి వికాసం
¤ వ్యక్తి శైశవదశ నుంచి వృద్దాప్యం వరకు శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతికాంశాల్లో జరిగే మార్పుల గురించి తెలిపేదే వికాసం. అభ్యాసకుడి వికాసం
¤ శిశు కేంద్రీకృత విద్యావిధానంలో పిల్లవాడు అభ్యసించాలంటే అతడిలో కలిగే క్రమానుగతమైన మార్పులను ఉపాధ్యాయుడు అర్థం చేసుకోవడం అవసరం. అభ్యాసకుడిలో తగిన పరిణతి లేదా పరిపక్వత ఉన్నప్పుడే సంసిద్ధత వస్తుంది. అభ్యసన ప్రక్రియ సులభతరం అవుతుంది.
¤ శారీరక అంశాల్లో సంభవించే పరిమాణాత్మక మార్పులను పెరుగుదల అంటారు.
¤ మానసిక, నైతిక, ఉద్వేగ, సాంఘిక, చలనాత్మక అంశాల్లో సంభవించే గుణాత్మక మార్పులను వికాసం అంటారు. ఇది జీవితాంతం కొనసాగే ప్రక్రియ.
¤ పెరుగుదలలో గుణాత్మక, పరిమాణాత్మక మార్పులుంటాయి. కానీ, వికాసం గుణాత్మకంగా ఉంటుంది.
¤ పుట్టుకతో ఉన్న సహజ సామర్థ్యాలు వయసుతోబాటు వికసించడాన్ని పరిణతి అంటారు.
¤ 'పరిణతి జన్యు ప్రభావాల సమాకలనం - స్వీయ పరిణతితో కూడింది' (గెసెల్), 'ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం జరుగుతుంది' (క్రైగ్).
¤ అభ్యసనానికి సన్నద్ధత అవసరం. శారీరక పెరుగుదల, మానసిక వికాసం ఉన్నప్పుడే అభ్యసన సాధ్యమవుతుంది. దీన్ని అభ్యసన సన్నద్ధత అంటారు.
¤ 'అభ్యసన సన్నద్ధత ఒక మానసిక వికాసం' - ఉడ్‌వర్త్
¤ అవసరం, ఆసక్తి, ప్రేరణ, సహజ సామర్థ్యాలు, అంతర్గత శక్తులు, బోధనాశైలి ఉపాధ్యాయుడి అంకిత భావం అనేవి అభ్యసన సన్నద్ధతను ప్రోత్సహిస్తాయి.
పెరుగుదల, వికాస-నియమాలు:
1. వికాసం క్రమానుగతం
ఉదా: భాష నేర్చుకోవడంలో లిళీళిజూ లు పాటించడం.
2. వ్యక్తిగత భేదాలు ఉంటాయి.
ఉదా: కొందరు పిల్లలు తొందరగా నడక నేర్చుకోవడం.
3. 'సులభం' నుంచి 'జటిలమైన' అంశాలకు వికాసం జరుగుతుంది.
ఉదా: నడవడంతో ఆరంభించి మెట్లు ఎక్కడం, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం.
4. ఒక దశలో వేగంగా, మరొక దశలో నెమ్మదిగా ఉంటుంది.
ఉదా: శారీరక వికాసం బాల్యదశలో తక్కువగా, కౌమారంలో ఎక్కువగా ఉంటుంది.
5. తల నుంచి శరీర భాగాలకు లేదా దేహ మధ్యస్థంలో ప్రారంభమై వెలుపలకు సాగుతుంది.
ఉదా: భుజాలమీద పక్కకు తిరగడం, మోచేతుల మీద పాకడం మణికట్టు ఆధారంగా పైకి లేవడం.
6. వికాసం సంచితం. జీవితాంతం కొనసాగుతుంది.
ఉదా: భాష నేర్చుకోవడంలో అక్షరాలు, గుణింతాలు, పదాలు, వాక్యాలుగా ఉండటం.
7. అనువంశికత పరిసరాలపై ఆధారపడి ఉంటుంది.
ఉదా: తల్లిదండ్రులు ప్రతిభావంతులైనా, పాఠశాల సరిగ్గా లేకుంటే ప్రజ్ఞ మరుగు పడుతుంది.
8. ఏకీకృతమొత్తంగా జరుగుతుంది.
ఉదా: వయసు పెరిగే కొద్దీ మానసిక, నైతిక వికాసాలు కూడా పెరుగుతాయి.
వికాసంపై అనువంశిక, పరిసరాల ప్రభావం:
¤ ముందు తరాల నుంచి సంక్రమించే లక్షణాలను పొందడమే అనువంశికత.
¤ అనువంశికత జన్యువు వల్ల ప్రసారమవుతుందని గ్రిగర్ జోహన్ మెండల్ వైవిధ్య, ప్రతిగమన సూత్రాల ద్వారా నిరూపించారు.
¤ ప్రముఖ కుటుంబాలు గాల్టన్, డార్విన్ వంశంపై పియర్సన్, జ్యూక్స్ కుటుంబంపై డగడేల్, కల్లకాక్ కుటుంబంపై గోడార్డ్, ఎడ్వర్డ్ కుటుంబంపై విన్‌షిప్, కవలలపై ఫ్రీమెన్ పరిశోధనలు అనువంశికత ప్రభావాన్ని వివరించాయి.
¤ 'వ్యక్తుల్లో సుఖదుఃఖాలకు కారణం అనువంశికత' అని ఆలోపోర్ట్ తెలిపారు.
¤ 'జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపేవన్నీ పరిసరాలే' - బోరింగ్, లాంగ్‌ఫీల్డ్, వెల్డ్
¤ 'వ్యక్తిపై పనిచేసే బయటి కారకాల సముదాయమే పరిసరం' - ఉడ్‌వర్త్
¤ బాగ్లే, వాట్సన్, గోర్డన్, ఫ్రీమన్, న్యూమన్, స్కోడాక్‌లు చేసిన పరిశీలనలు పరిసరాల ప్రాధాన్యాన్ని వివరిస్తాయి.
¤ వ్యక్తుల వికాసానికి పాఠశాల వసతులకు సహసంబంధ గుణకాన్ని డబ్ల్యు.సి. బాగ్లే వివరించారు. (గ్రంథం - ఎడ్యుకేషనల్ డిటర్మినిజం)
¤ మిల్డ్రెడ్, రూత్ కవలల మీద పరిశోధనలు చేసిన ఫ్రీమన్, జిప్సీ పిల్లలను పరిశోధించిన గోర్డన్ వ్యక్తి వికాసానికి పరిసరాలే కారణమని నిరూపించారు.
¤ విద్యార్థుల ప్రజ్ఞాపాటవాలు, అభిరుచులు, దృక్పథాలు తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడికి అనువంశికత, పరిసరాల ప్రభావ పరిజ్ఞానం అవసరం.
¤ 'అనువంశికత, పరిసరాల సమష్టి ఉత్పన్నమే వ్యక్తి' అని తెలిపింది ఉడ్‌వర్త్.
వ్యక్తి వికాస దశలు:
ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం మానవ జీవితంలో 10 వ్యక్తి వికాస దశలు ఉన్నాయి.
వికాస దశ | వయస్సు | ఉపమానం |
1. నవజాత శిశువు | పుట్టినప్పటి నుంచి 2 వారాల వరకు | జననాంతర పరిసర సర్దుబాటు దశ |
2. శైశవ దశ | 2 సంవత్సరాలు | ముద్దుగొలిపే దశ |
3. పూర్వ బాల్యదశ | 3-5 సంవత్సరాలు | అన్వేషణ/ ప్రమాదాల దశ |
4. ఉత్తర బాల్యదశ | 6-10 సంవత్సరాలు | ముఠా వయసు, అనుకరణ దశ |
5. యవ్వనారంభ దశ | 11-12 సంవత్సరాలు | ప్యూబర్టీ దశ |
6. పూర్వ కౌమారదశ | 13-17 సంవత్సరాలు | ఒడిదొడుకుల దశ |
7. ఉత్తర కౌమార దశ | 17-21 సంవత్సరాలు | వ్యక్తి నిలకడ దశ |
8. వయోజన దశ | 21-40 సంవత్సరాలు | అనుభవాల విస్తృతి దశ |
9. మధ్యవయసు | 40-60 సంవత్సరాలు | సర్దుబాటు దశ |
10. వృద్ధాప్యం | 60-పైన | సెనెలిటి దశ |
¤ జీవ క్రియల వల్ల శరీరంలో సంభవించే పరిణతిని శారీరక పెరుగుదల అంటారు. వ్యక్తి బాహ్య స్వరూపంలో, అంతర్గత అవయవాల్లో సంభవించే మార్పులను శారీరక పెరుగుదల లేదా చలన వికాసంగా గుర్తిస్తారు.
¤ చలన వికాసం క్రమబద్ధంగా జరగకపోతే విషమ యోజనం కలుగుతుంది.
శారీరక పెరుగుదల నియమాలు:
వికాస దిశా నియమం :
వికాసం తల నుంచి ప్రారంభమై కాళ్లకు కొనసాగుతుంది (శిరోపాదాభిముఖం).
లయ వికాస నియమం:
వికాసం శైశవదశలో, కౌమారదశలో ఎక్కువగా, బాల్య వయోజన దశల్లో తక్కువగా ఉంటుంది.
అవిచ్ఛిన్నతా నియమం :
శారీరక పెరుగుదల క్రమబద్ధంగా, నిరంతరంగా జరుగుతుంది.
స్వయం సిద్ధ నియమం :
స్వయంగా ఉంటుందే తప్ప, బాహ్య కారకాల వల్ల ప్రభావితం కాదు.
వికాసం వేగ నియమం :
ఒక్కో శరీర భాగం, ఒక్కో వేగంతో వికాసం చెందుతుంది.
శైశవ దశ :
పుట్టినప్పటి నుంచి 3 సంవత్సరాల వరకు కొనసాగే దశ. మొదటి రెండు వారాలను నవజాత శిశుదశ అంటారు.
శారీరక వికాసం:
¤ నవజాత శిశువు తల శరీరం పొడవులో నాలుగో వంతు ఉంటుంది.
¤ శిశువు మెదడు బరువు వయోజనుడి మెదడు బరువులో నాలుగో వంతు ఉంటుంది. ఏడాది వయసొచ్చేటప్పటికి ఇది వయోజనుడి మెదడు బరువులో సగానికి పెరుగుతుంది.
¤ ఎముకలు, కండరాలు అభివృద్ధి చెందుతాయి. నడవటం ఆరంభమవుతుంది.
¤ మొదటి సంవత్సరం బరువులో, రెండో సంవత్సరం ఎత్తులో పెరుగుదల వేగంగా ఉంటుంది.
¤ 6, 8 నెలల మధ్య మొదటి దంతం వస్తుంది. మొదటి సంవత్సరం నాటికి 4 నుంచి 6, రెండో సంవత్సరాంతానికి 16 దంతాలు వస్తాయి.
సాంఘిక వికాసం:
¤ మొదటి రెండు నెలల్లో ప్రారంభమవుతుంది.
¤ 6, 7 నెలల్లో కుటుంబ సభ్యులకు, ఇతరులకు తేడా గుర్తిస్తారు.
¤ 1 నుంచి 11/2 సంవత్సరాల వరకూ ఏకాంత క్రీడలు, 2 సంవత్సరాల తర్వాత సమాంతర క్రీడలు, 3, 4 సంవత్సరాల్లో సహకార క్రీడలు ఆడతారు.
మానసిక వికాసం :
¤ చిన్న, చిన్న మాటల ద్వారా భావాన్ని వ్యక్తీకరిస్తారు. ఇంగితాలు- ప్రాక్భాషా రూపాలు ఉంటాయి. సంవేదనలు, అవధానం, ప్రత్యక్షం, ఆసక్తులు నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి.
¤ జ్ఞానేంద్రియ వికాసం జరుగుతుంది. రంగుల విభేదాన్ని గుర్తించగలుగుతారు.
ఉద్వేగ వికాసం :
¤ మొదటి నాలుగు నెలల వరకు ప్రకటించే ఉద్వేగం - ఉద్రిక్తత.
¤ 3 నెలల నాటికి ఉప్పొంగడం, వాత్సల్యం వస్తాయి. 2 సంవత్సరాలకు భయం, కోపం, ఆనందం, ప్రేమ అభివృద్ధి చెందుతాయి.
నైతిక వికాసం :
¤ ఆత్మభావన ఉండదు. స్వార్థ లక్షణం కనిపిస్తుంది.
బాల్యదశ:
¤ 4-12 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని బాల్య దశ అంటారు.
శారీరక వికాసం:
¤ శారీరక అవయవాలు, కండరాలు, ఎముకలు, అంతః స్రావ గ్రంథుల్లో మార్పులు వస్తాయి.
¤ అవయవాల మధ్య సమన్వయం కలుగుతుంది. మొండెం దీర్ఘ చతురస్రాకారమవుతుంది.
¤ దూకడం, పరిగెత్తడం లాంటి చలన కౌశలాలు అభివృద్ధి చెందుతాయి.
¤ నైపుణ్యాలు వికసించకుండానే పనులు చేయడం వల్ల ప్రమాదాలకు గురవుతారు.
¤ ఉత్తర బాల్యదశలో శాశ్వత దంతాలు వస్తాయి.
¤ జననేంద్రియాల పరిపక్వత ప్రారంభమవుతుంది.
మానసిక వికాసం:
¤ ఆసక్తి ఎక్కవ. ప్రశ్నార్థకాల దశ అంటారు.
¤ కాలం, దూరం స్థలం లాంటి భావనలు తెలుసుకోగలుగుతారు.
¤ పాఠశాల కౌశలాలైన చదవడం, రాయడం, అవగాహన చేయడం, ఆలోచించడం, చర్చించడం అభివృద్ధి చెందుతాయి.
¤ అభ్యసన సంసిద్ధత, భాషా వికాసం కలుగుతాయి.
ఉద్వేగ వికాసం:
¤ ఉద్వేగ ప్రకటనలో స్థిరత్వం వస్తుంది.
¤ అసూయ, కోపం ఎక్కువ. 5 సంవత్సరాల నాటికి వ్యాకులత, ఆశాభంగం కనిపిస్తాయి.
¤ కథలు, కార్టూన్ల పట్ల మక్కువ చూపుతారు
నైతిక వికాసం:
¤ పూర్వ సంప్రదాయ స్థాయి ఉంటుంది.
¤ తన అవసరాలను తీర్చేవి, సంతృప్తినిచ్చేవన్నీ ఒప్పుగా భావిస్తారు (4-10 సం.)
¤ 11-13 సంవత్సరాల్లో సంప్రదాయ స్థాయి ఏర్పడుతుంది.
¤ ఇతరులను సంతోషపెట్టడానికి, అధికారాన్ని గౌరవించడానికి సిద్ధంగా ఉంటారు.
సాంఘిక వికాసం:
¤ సాంఘిక క్రీడల్లో పాల్గొంటారు.
¤ పెద్దలను వ్యతిరేకిస్తారు. మాట వినరు.
కౌమార దశ :
13-21 సంవత్సరాల వరకు ఉన్న దశను కౌమార లేదా యవ్వన ఆవిర్భావ లేదా కిశోరప్రాయ దశ లేదా అడాలసెంట్ దశ అంటారు. అడోల్సియర్ (లాటిన్) అంటే పరిపక్వం కావడం అని అర్థం.
శారీరక వికాసం:
¤ ఎత్తు, బరువు, ఆకారాల్లో గరిష్ఠ అభివృద్ధి జరుగుతుంది.
¤ గ్రంథులు చురుగ్గా పనిచేస్తాయి.
¤ ద్వితీయ లైంగిక లక్షణాలు ప్రస్ఫుటమవుతాయి.
¤ పునరుత్పత్తి సామర్థ్యం కలుగుతుంది.
మానసిక వికాసం:
¤ ప్రజ్ఞ, తార్కిక చింతన, ఆలోచన, వివేచన, విమర్శనాత్మక ధోరణి పరిశీలన దృష్టి తీవ్రంగా అభివృద్ధి చెందుతాయి
¤ కార్యకారణ సంబంధాలను గుర్తిస్తారు. పగటి కలలు కంటారు.
¤ భిన్న లింగ వర్గీయులను ఆకర్షిస్తారు.
¤ స్వేచ్ఛ పెరుగుతుంది. భావాలు ధైర్యంగా, నిర్మాణాత్మకంగా వ్యక్తం చేస్తారు.
ఉద్వేగ వికాసం:
¤ ఒత్తిడి, కలత, జగడాలతో కూడిన దశ (స్టాన్లీహాల్)
¤ శారీరక, మానసిక, నైతిక, సాంఘిక, ఉద్వేగ సమస్యలు ఎదుర్కొంటూ సర్దుబాటు పొందే దశ (కోహ్లాన్)
¤ సానుభూతిని సహించలేరు. భద్రతను కోరుకుంటారు.
¤ శారీరక మార్పుల వల్ల వ్యాకులత, ఆందోళన వస్తాయి.
¤ విమర్శలను భరించలేరు, న్యూనతకు గురవుతారు.
నైతిక వికాసం:
¤ సంప్రదాయ స్థాయిని పాటిస్తారు (ఇతరులకు సేవ చేస్తారు)
¤ లైంగికాసక్తి విపరీతం కావడం వల్ల దురలవాట్లకు గురవుతారు.
¤ నైతిక బోధక ద్వారా స్వీయ క్రమశిక్షణ అలవాటు చేసుకోగలుగుతారు.
సాంఘిక వికాసం:
¤ భిన్న లింగ వర్గీయుల సమూహాలను ఏర్పరచుకుంటారు.
¤ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు (ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్)
¤ వ్యక్తిపూజ ఎక్కువ.
¤ హక్కులు, బాధ్యతలు తెలుసుకుని ప్రవర్తిస్తారు.
వయోజన దశ:
21 సంవత్సరాల వయసును వయోజన దశ అంటారు. ఈ దశలో శారీరక పెరుగుదల పూర్తిగా ఆగిపోతుంది. ఉద్వేగ, నైతిక, వికాసాల్లో స్థిరత్వం కలుగుతుంది. వాస్తవికతకు ప్రాధాన్యమిస్తారు. పౌర జీవన బాధ్యతలను స్వీకరిస్తారు. మధ్య వయసులో అసంతృప్తి, ఒత్తిళ్లుంటాయి. దీనినే అంటారని ఎరిక్ కింగ్లర్ పేర్కొన్నాడు. మధ్య వయసు, వృద్ధాప్యంలోనివారు ఇష్టం లేకపోయినా ఏకాంతాన్ని కోరుకుంటారని పీలే పేర్కొన్నారు.
No comments:
Post a Comment