Study Material for APTET and DSC

Study Material for APTET and DSC

Thursday, 22 March 2012

APTET Telugu Notes (మూడు చేపలు, లేఖ, ముందడుగు, మేడం క్యూరీ )


'మూడు చేపలు'
'మూడు చేపలు' అనే పాఠ్యభాగాన్ని రచించింది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈయనకు 'కథక చక్రవర్తి' అనే బిరుదు ఉంది. ఈయన రాసిన వడ్లగింజలు, గులాబీ అత్తరు, మార్గదర్శి, కలుపుమొక్కలు, ఇలాంటి తవ్వాయి వస్తే.. మొదలైన కథలు ప్రసిద్ధి చెందాయి. రక్షా బంధనం, ఆత్మబలి లాంటి నవలలూ, రాజరాజు, కలంపోటులాంటి నాటకాలూ రాశారు. గోదావరి జిల్లాల మాండలిక శైలి వీరి రచనల్లో కనిపిస్తుంది. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి వ్యావహారిక భాషావాది. 'ప్రబుద్ధాంధ్ర' అనే పత్రిక నడిపారు. 'అనుభవాలూ- జ్ఞాపకాలూను' అనే ఈయన స్వీయచరిత్ర చదవదగింది. ప్రస్తుత పాఠ్యాంశం 'మూడు చేపలు' ఈయన రాసిన 'పురాణగాథలు' నుంచి స్వీకరించింది.
సారాంశం
            
దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు అనేమూడు చేపలు ఒక మడుగులో ఉన్నాయి. వేసవి సమీపిస్తూండగా దీర్ఘదర్శి అనే చేప ఇలా అంది- ''వేసవిలో మడుగు ఇంకిపోతే మనకు ప్రమాదం. అందుకని ఇప్పుడే బాగా నీరున్న పెద్ద మడుగుకు వెళ్దాం.'' కానీ, ప్రాప్తకాలజ్ఞుడు అనే చేప ''ప్రస్తుతం నీరుంది కదా! ఎప్పుడో కష్టం వస్తుందనుకొని ఇంత చక్కటి నివాసం విడిచి వెళ్లడం మంచిదికాదు'' అంది.
దీర్ఘసూత్రుడు అనే చేప కూడా దీర్ఘదర్శితో ఏకీభవించకుండా ఇప్పుడు విడిచి వెళ్లనవసరం లేదని చెప్పింది. ఇంతలో వేసవి వచ్చి నీరు ఎండిపోయింది. దీర్ఘదర్శి మాత్రం మడుగు నుంచి పెద్ద మడుగుకు వెళ్లి సుఖంగా ఉంది. జాలరులు వచ్చి చేపలను పట్టుకుపోతున్నారు. ప్రాప్తకాలజ్ఞుడు దీర్ఘదర్శి మాటలు విననందుకు దిగులుచెంది చేపలు గుచ్చిన తాటిని కరచిపట్టుకొని ఉంది. దీర్ఘసూత్రుడు మాత్రం జాలరి చేపల బుట్టలోకి వెళ్లిపోయింది. జాలరి చేపలు గుచ్చిన తాటిని పెద్ద కాలువలో కడుగుతుండగా ప్రాప్తకాలజ్ఞుడు నీటిలోకి దూకి తప్పించుకుంది.
            
మూడు చేపలు కథవల్ల 'కీడెంచి మేలెంచాలి' అనే నీతి తెలుస్తుంది. 'వినదగునెవ్వరు సెప్పిన' అన్నది గుర్తుకు వస్తుంది. మున్ముందు రాగల అపాయాన్ని బుద్ధినుపయోగించి పసిగట్టి దానికనుగుణంగా ప్రవర్తించడం వివేక వంతుల లక్షణం.
అర్థాలు:
         
అపారంఅంతులేనిది
         
జాలరి = చేపలు పట్టేవాడు
         
ఊత = చేపలు పట్టే సాధనం
సమాసాలు
         
మూడు చేపలు - మూడు సంఖ్యగల చేపలు - ద్విగుసమాసం
         
మహాసముద్రం - గొప్పదైన సముద్రం - విశేషణ పూర్వపద కర్మధారయం
సందర్భ వాక్యాలు:
¤ ''
ఎండిపోని పెద్ద మడువు చూచుకొని ఇప్పుడే దానిలోనికి పోవుదము'' - దీర్ఘదర్శి
¤ ''
ఎప్పుడో కష్టము వచ్చునేమోఅని ఇప్పుడు చక్కని నివాసము విడిచిపోవుట మంచిదికాదు''  - ప్రాప్తకాలజ్ఞుడు
¤ ''
చక్కగా ఆలోచించకుండా తొందరపడి ఏమియూ చేయరాదు'' - దీర్ఘసూత్రుడు
¤ ''
తల్లడిల్లుచు కూర్చుండుట మంచిది కాదు. ఉపాయము చూడవలెను'' - ప్రాప్తకాలజ్ఞుడు.
                                                                                    
లేఖ
             
గద్యరచనా ప్రక్రియల్లో లేఖ ఒకటి. తెలుగులో చాలా లేఖాసాహిత్యం ఉంది. గుండె విప్పి చెప్పుకునే వీలుండేది లేఖ. పాఠ్యభాగంలోని లేఖను వెంకటరమణ అనే తండ్రి రవి అనే కుమారుడికి రాశాడు. దీనికి సమాధానంగా రవి నాన్నకు ఒక లేఖ రాశాడు. కఠినమైన పదాలేవీ లేవు గానీ, రెండుమూడు పదాలకు అర్థాలు తెలుసుకుంటే మంచిది. అలమటించు అంటే దుఃఖించడం, పరితపించడం. విపత్తు అంటే ఆపద.
లేఖలోని ముఖ్యాంశాలు:
¤
రవి పాఠశాల విద్యార్థులు మహారాష్ట్ర భూకంప బాధితుల కోసం ప్రధానమంత్రికి అయిదువేల రూపాయల విరాళం పంపారు.
¤
ఇతరులకు సహాయం చెయ్యాలని, క్రమశిక్షణతో ఉండాలని, స్నేహభావంతో, ఆత్మవిశ్వాసంతో మెలగాలని తండ్రి రవికి బోధించాడు.
¤
తండ్రి వెంకటరమణ రాసిన ఉత్తరాన్ని పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చదివి ఆనందించారు.
¤ రవి, ఇతర విద్యార్థులు అక్షరాస్యత వంటి సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
¤
రవి గాంధీ 'ఆత్మకథ' పుస్తకాన్ని కొని చదువుతున్నాడు.
¤
తండ్రి వెంకటరమణ హన్మకొండ నుంచి లేఖ రాస్తే, రవి మదనపల్లె- గురుకుల విద్యాలయం నుంచి లేఖ రాశాడు.
తండ్రి రాసిన లేఖలోని సూక్తులు:
¤
పొరుగువాడి బాధ మనకూ బాధే.
¤
విద్యార్థికి క్రమశిక్షణ చాలా అవసరం. ఇతరులపై ప్రతి పనికి ఆధారపడకూడదు.
¤
ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి.
¤
అందరూ సమానులు. పరస్పర స్నేహ భావంతో మెలగాలి.
¤
మంచి సాహిత్యాన్ని చదవడంవల్ల మానసిక వికాసం కలుగుతుంది.
¤
మంచి పుస్తకాన్ని మించిన మిత్రుడుండడు.
¤
తోటి వారిని చూసి ఈర్ష్య పడకూడదు.
¤
సమాజంలో మంచితోపాటు చెడు కూడా ఉంటుంది.
                                          ముందడుగు
            ఇది సంభాషణాత్మకమైన పాఠ్య భాగం. అంటే నాటకీకరణకు అవకాశం ఉన్న పాఠ్యభాగం. ఇందులో రచయిత స్వయంగా చెప్పకుండా పాత్రలతో చెప్పించడాన్ని గమనిస్తాం. 'ముందడుగు' పాఠ్యభాగంలో రచయిత లేడనీ, దేనినుంచి స్వీకరించారో కూడా లేదని గ్రహించాలి. ఇందులోని పాత్రలు:  పావన్, నాయనమ్మ, హిమ.
స్త్రీలు అబలలు కాదు, సబలలనీ, అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారనీ, వెళ్లగలరనీ చెప్పే పాఠమే 'ముందడుగు'. నాయనమ్మ ఛాందసురాలు. పూర్వ కాలపు మనిషి. హిమ ఆధునిక స్త్రీ. అభ్యుదయ భావాలున్న మహిళ.
పాఠ్యభాగంలోని ముఖ్యాంశాలు:
¤
ఆడవారు చేయలేని పనులు లేవు. చేయని ఉద్యోగాలు లేవు.
¤
రుద్రమదేవి, ఝాన్సీ, చాంద్‌బీబీ లాంటి స్త్రీలు యుద్ధం చేశారు.
¤
పూర్వం 10, 15 రోజుల పిల్లలకు కూడా పెళ్లిళ్లు చేసేవారు.
¤
రాజారామమోహన్‌రాయ్, జ్యోతిరావుపూలే (మహాత్మా), ఈశ్వరచంద్ర విద్యాసాగర్, కందుకూరి వీరేశలింగం లాంటివారు స్త్రీల అభ్యుదయానికి కృషిచేసి మూఢాచారాలను రూపుమాపారు.
¤
వీరేశలింగం వితంతువులకు పునర్వివాహం చేయించాడు. ఆడపిల్లలకోసం పాఠశాలలు స్థాపించాడు.
¤
సతీసహగమన దురాచారాన్ని ప్రభుత్వం నిషేధించేలా సంఘసంస్కర్తలు కృషి చేశారు.
¤
ఆడా, మగా తేడాలు, మనుషుల్లో తేడాలు పోయినప్పుడే, అసలైన ప్రగతి. అదే ముందడుగు. ముందడుగు అంటే పురోభివృద్ధి, అభ్యుదయం అని భావం.
అర్థాలు:
        
చోద్యం  = వింత, విచిత్రం
        
అంతరిక్షం = ఆకాశం
        
వితంతువు = భర్త చనిపోయిన స్త్రీ
పర్యాయపదాలు
        
చోద్యంవింత, విశేషం
        
అంతరిక్షం - గగనం, దివి 
        
భార్య - సతి, పత్ని, అర్ధాంగి
వ్యతిరేకపదాలు:
       
విద్య ×  అవిద్య
       
దురాచారం ×  సదాచారం
సందర్భ వాక్యాలు:
¤ ''
ఆడవాళ్లు పనిచేయలేని రంగాలే లేవు. అంతరిక్షంలోకి కూడా వెళ్తున్నారు'' (హిమ).
¤ ''
సంస్కర్తలు స్త్రీ విద్యను ప్రోత్సహించారు'' (హిమ).
¤ ''
ఇప్పుడు స్త్రీల పరిస్థితి చాలా మెరుగుపడింది. అన్ని రంగాల్లోనూ మగవాళ్లతో సమానంగా పని చేసే స్థితి వచ్చింది''.
                                                             మేడం క్యూరీ
             ఇది 'జీవిత చరిత్ర'కు సంబంధించిన పాఠ్యభాగం. జీవిత చరిత్రను తొలిసారిగా రాసింది కందుకూరి వీరేశ లింగమని పేర్కొంటారు. పాఠ్యభాగం కూడా ఎవరు రచించారో, దేని నుంచి స్వీకరించారో తెలియదు.
సారాంశం
            
పోలెండ్ రాజధాని అయిన వార్సాలో 1867 నవంబరు ఏడో తేదీన మేడం క్యూరీ జన్మించింది. క్యూరీ పేరు మేరీ.
తండ్రి విజ్ఞాన శాస్త్ర ఆచార్యుడైన స్ల్కోడోవ్‌స్కా. రష్యన్ పరిపాలనలో పోలిష్ భాష నిరాదరణకి గురైంది. క్యూరీకి ఫ్రెంచి భాష వచ్చు కాబట్టి, ఫ్రాన్సు రాజధాని ప్యారిస్‌కి వెళ్లింది. ప్యారిస్‌లో సార్బోన్ విశ్వవిద్యాలయంలో పరిశోధనాగారంలో గాజు పాత్రలను శుభ్రం చేసే పని చేపట్టింది. అక్కడే పియరీక్యూరీతో పరిచయం అయింది. వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. మేడం క్యూరీ 1898లో రేడియంను కనిపెట్టింది. 1903లో ప్యారిస్ విశ్వవిద్యాలయం మేడంక్యూరీకి డాక్టరేట్ ప్రదానం చేసింది. లండన్‌లోని రాయల్ సొసైటీ క్యూరీ దంపతులకు 'డేవీ' పతాకాన్ని బహూకరించింది. 1903లోనే క్యూరీ దంపతులకు, హెన్రీ బిక్వెరెల్‌కు కలిపి భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. 1911లో మేడం క్యూరీకి రెండోసారి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. తన పరిశోధనల కోసం మేడం క్యూరీ సార్బోన్‌లో ఒక రేడియం సంస్థను నెలకొల్పింది. రేడియంను క్యాన్సర్ చికిత్సలో వాడతారు.ఈమెకు ఐరీన్, ఈవ్ అనే కుమార్తెలున్నారు. విచిత్రం ఏమిటంటే, ఐరీన్ దంపతులకు కూడా 1935లో నోబెల్ బహుమతి రావడం. కృత్రిమంగా రేడియో ధార్మికతను రూపొందించినందువల్ల వారికి గౌరవం లభించింది. మేడం క్యూరీ 1934, జులై 4 కన్ను మూసింది.
వ్యతిరేక పదాలు:
           
కృత్రిమం × సహజం
           
పురోగమనం × తిరోగమనం
           
ఆదరణ × నిరాదరణ
           
వ్యతిరేకం × అనుకూలం
           
ఆసక్తి × నిరాసక్తి
కన్నుమూయు - జాతీయం - మరణించడానికి వాడతారు.
అధీనం అంటే వశం.
సమాసాలు:
వార్సా నగరం - వార్సా అనే పేరుగల నగరం - సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం
శాస్త్ర పరిశోధన - శాస్త్రం నందు పరిశోధన - సప్తమీ తత్పురుష
జీవనాధారం - జీవనమునకు ఆధారం - షష్ఠీతత్పురుష
భార్యాభర్తలు - భార్యయు, భర్తయు - ద్వంద్వసమాసం
మూడుధాతువులు - మూడు సంఖ్యగల ధాతువులు - ద్విగుసమాసం
మానవ పురోగతి - మానవుడి యొక్క పురోగతి - షష్ఠీతత్పురుష.

No comments:

Post a Comment